మే నెలలో కీలక పరిణామాలు ఉన్నాయి. పాలన పరంగా వచ్చే మార్పులు కొన్ని ఉన్నాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు ముందుగానే అప్రమత్తం అయి పోతున్నారు. అధికారుల మార్పిడికి, అధికారాల మార్పిడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యాన పనిచేయకపోతే వెళ్లిపోవాలని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఓ బాధ్యత గల నియోజకవర్గ ప్రతినిధి ఈ మాట అన్నారు. వాస్తవానికి ఉద్యోగులు ఒత్తిడిని దాటి పనిచేయాలి. రాజకీయ ఒత్తిడి ఇప్పుడు విపరీతంగా ఉంటుంది. నియోజకవర్గాల పరిధిలో పనులు చాలా ఆగి ఉన్నాయి. వాటిని పరిష్కరించడం అంత త్వరగా సాధ్యం కాదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా వాళ్ల పనితీరు మెరుగు పరిచే సూచనలు ఇవ్వకుండా ఓ బాధ్యత గల ప్రతినిధి హెచ్చరికలు ఇస్తున్నారు.
సమస్యలు పరిష్కరించడం కన్నా అధికారులను టార్గెట్ చేయడం అన్నది ఓ ముఖ్యమయిన విషయంగానే చూస్తున్నారు పాలక వర్గాలు. పనిచేయని వారిని తమకు నచ్చినవిధంగా పని చేసేలా దిశా నిర్దేశం చేయించగలగాలి కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో కాలం వెళ్లదీయడం భావ్యం కాదు. గతంలో ఫైళ్ల క్లియరెన్స్ కు నెలలో ఓ రోజు ఉండేది. ఇప్పుడది లేదు. అదేవిధంగా వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో పాటు అధికారులు పనిచేయాల్సి ఉంది. ఈ దశలో ఒకవేళ ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలి. కానీ బాధ్యత గల పాలకులు మాత్రం అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారే తప్ప సాధ్యమయినంత సౌమ్య రీతిలో ప్రవర్తించడం లేదు. ఇదే ఇప్పుడు వివాదాలకు తావిస్తోంది.
మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాసు మళ్లీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆ వివరం ఈ కథనంలో…
మంత్రులంతా ఎలా ఉన్నారు అన్న ప్రశ్న దగ్గర నుంచి.. మంత్రుల హయాంలో జరిగిన లేదా జరుగుతున్న పనులేంటి అన్న ప్రశ్న వరకూ ఆలోచించి వెళ్లాలి. కానీ ఇక్కడ అంటే ఆంధ్రావనిలో ఆశించిన ఫలితాలు కన్నా ఆశించని ప్రశంసల వాన ఒకటి అదే పనిగా ముఖ్యమంత్రి విషయమై కొనసాగుతోంది. ప్రశంసల వాన కారణంగా ఫలితాలు రావు అని ముఖ్యమంత్రి జగన్ చెప్పినా వినిపించుకునే దాఖలాలు లేవు. పనులు అయితే జరగడం లేదు.
క్షేత్ర స్థాయిలో ఫలితాలు అస్సలు బాలేవు. మే 10 తరువాత చేపట్టబోయే సర్వేలు చాలా నిజాలే చెబుతాయి. వింటూ ఉండండి. అదేవిధంగా సర్వేలలో తేలిన నిజాల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. కానీ మాజీ డిప్యూటీ సీఎం తానే మళ్లీ పోటీ చేస్తానని చెప్పారు. తనకు నియోజకవర్గాన ఎదురు లేదు అన్న విధంగా మాట్లాడారు. ఇదే సందర్భాన అధికారులు తమకు నచ్చకుంటే బదిలీలు చేయించుకుని వెళ్లిపోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇవే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశం అయ్యాయి.