తెలంగాణ వాకిట నిన్నటి నుంచి ఒకే పదం చక్కర్లు కొడుతోంది. ఆ పదం చుట్టూనే పద్ధతి ఉన్నా లేకపోయినా అదే పనిగా కొన్ని విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. అంటే రాజకీయంలో బెంబేలెత్తిపోవడాలు, ఆందోళన చెందిపోవడాలు అన్నవి ఉంటాయి కానీ మరీ ! ఇంతగా ఆందోళనలూ, భయాలూ, ఉత్పాతాలూ చెందడం ఎంత మాత్రం తగదు. అంటే ప్రత్యర్థి పార్టీలు మాట్లాడడమే నేరం అన్న విధంగా గులాబీ దండు కానీ లేదా ఏ ఇతర పార్టీల సమూహాలు కానీ వర్గాలు కానీ సంబంధిత నాయకత్వాలు కానీ ప్రవర్తించడం తగదు. అయినా కూడా కేసీఆర్ కు ఎందుకు భయం వస్తుంది. ఆయనకేం తిరుగులేని మెజార్టీ ఖాయం అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి కదా ! కనుక ఇప్పుడు ఓ సారి పొలిటికల్ టూరిజం అంటే ఏంటో చూద్దాం.. ఆ టూరిస్టులు ఎవరో కూడా చూద్దాం ఈ ఎడిట్ నోట్ లో.. వారాంతం వివాదాంతం..
తెలంగాణలో ముఖ్యంగా రెండంటే రెండు పార్టీలు బలీయంగా కేసీఆర్ శక్తులను ఓడిచేందుకు పనిచేస్తున్నాయి. యాదృచ్ఛికమో, కాకతాళీయమో ఆ రెండు పార్టీలూ జాతీయ పార్టీలు కావడం, గతంలో ఆ రెండు పార్టీల నేతలతో కేసీఆర్ అతి దగ్గర పనిచేయడం గమనార్హం. ఎంత లేదన్నా ఎవరు కాదన్నా తెలంగాణ ఇచ్చిన పార్టీని కేసీఆర్ పట్టించుకోలేదు. పట్టించుకోవడం లేదు కూడా !
ఇప్పుడు కూడా ఆయన అదే పంథాలోనే ఉన్నారు. యువ రాజు రాహుల్ అనే నాయకుడు, మరో యువరాజు కేటీఆర్-కు ఎంత మాత్రం పోటీ కాదు కానీ ఎందుకనో ఆయన బెంబేలెత్తిపోతున్నారు. రాహుల్ చెప్పాలనుకున్నదేదో చెబితే ఆ స్క్రిప్ట్ ఎవరు రాసింది ఎందుకు రాసింది అన్నది తేలిపోతుంది. అదృష్టం ఆయన చెప్పాలనుకున్నవేవో చెప్పే వెళ్లాడు. మరీ అంత కన్ ఫ్యూజన్ మైండ్ తో ఏమీ లేడు. అదేవిధంగా మరో జాతీయ పార్టీ అధినేత జేపీ నడ్డా కూడా చెప్పాల్సింది చెప్పి, ప్రసంగ ధారలో భాగంగా తెలంగాణ రజకార్ల సమితి అని టీఆర్ఎస్ ను అభివర్ణించి వెళ్లిపోయారు. ఇవే ఇప్పుడు తెలంగాణ ఇంటి పార్టీ కోపాలకు కారణం అయి, వాళ్లను పొలిటికల్ టూరిస్టులను చేసేసింది.