బౌద్ధానికి ప్రతీకగా విలసిల్లే నేలపై మరో అద్భుతం సాక్షాత్కారం అయింది. ఇందుకోసం ఎప్పటి నుంచో అనుకుంటున్న రీతిలోనే నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి, ప్రపంచ స్థాయిలో బౌద్ధం విలసిల్లిన దేశాలు అన్నీ గర్వించే విధంగా నిర్మాణం పూర్తైంది. ఆ నిర్మాణం పేరే బుద్ధవనం.
బుద్ధుడికి ప్రతీకగా ఆయన ఆనవాళ్లకు సుస్థిర రూపం ఇచ్చేవిధంగా నల్లగొండ జిల్లాలో మహా నిర్మాణం పూర్తైంది. బుద్ధవనం పేరిట ఆరంభం కానున్న ఈ నిర్మాణాన్ని ఈ నెల 14 ప్రారంభించి, సందర్శుకులను అనుమతించనున్నారు కేటీఆర్. నాగార్జున హిల్ లో 274 ఎకరాల్లో ఈ అపూర్వ నిర్మాణ క్రమానికి 17 ఏళ్ల కాలం వెచ్చించారు. ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి గాంచిన బుద్ధ ధర్మానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఇందులో నిక్షిప్తం చేశారు.
ముఖ్యంగా బుద్ధ జననంకు సంబంధించిన వివరాలు, వాటి విశేషాలు దగ్గర నుంచి నిర్యాణం వరకూ ప్రతి విషయాన్నీ వివరాన్నీ ఇక్కడ పొందు పరిచారు. అష్టా దశ మార్గాన్ని సంకేతిస్తూ ఇక్కడ ఏర్పాటయిన 8 పార్కులు కూడా విశేషంగానే ఆకట్టుకోనున్నాయి. ఇక్కడ శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నింటికీ కలిపి విశేష ఆకర్షణ దక్కేలా ఈ వనాన్ని అందంగా అపురూప రీతిలో తీర్చిదిద్దారు. ఇందుకు 274 కోట్ల రూపాయలు కేటాయించారు.
2004లో ప్రారంభం అయిన ఈ ప్రాజెక్టుకు తొలి రోజుల్లో కేంద్రమే నిధులు ఇచ్చింది. తరువాత రాష్ట్ర విభజన జరిగేక తెలంగాణ ప్రభుత్వమే నిధులు అందించింది అని నిర్వాహకులు అందిస్తున్న వివరాల ప్రకారం నిర్థారణ అవుతోంది. మొదట నుంచి ఇక్కడి నిర్మాణాలను బౌద్ధులు ఆకట్టుకునే విధంగానే రూపుదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బుద్ధుడి జీవిత విశేషాలు అన్నీ శిల్పాల రూపంలో ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఇందుకోసం కడప జిల్లా నుంచి ప్రత్యేకంగా మార్బుల్ స్టోన్ ని తెప్పించారు. ప్రధాన మార్గాలన్నింటినీ పాలరాయితోనే రూపొందింపజేశారు.
బుద్ధుడి జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రతి అంశం ఇక్కడ అబ్బుర పరిచే విధంగా ఆయన జీవితాన్ని ఎంతగానో మార్చిన జ్ఞానోదయ ఘట్టాన్ని విగ్రహం రూపంలో చెక్కారు. ఆయన తపో వనంలో ఉండే ప్రత్యేక రకం చెట్లను ఇక్కడ కూడా పెంచారు. వివిధ దేశాల వాసులు వచ్చి, ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కొంత స్థలాన్ని కూడా కేటాయించారు. బౌద్ధం ఇప్పటికీ అలరారుతున్న టిబెట్, శ్రీలంక, అమెరికాతో సహా మన దేశానికి చెందిన సిక్కీం వాసులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కొంత స్థలం కేటాయించి వదిలారు.