కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున కష్టాలు మొదలయ్యాయి. తాజాగా కాంగ్రెస్‌కు భారీ షాకే తగిలింది. బీజేపీ కుంభస్థలాన్నే ఢీకొట్టాలన్న కాంగ్రెస్ కల.. కలగానే మిగిలింది. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొస్తున్న తరుణంలో ఉద్యమ నేత, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. తాను తీసుకున్న నిర్ణయాన్ని గుజరాత్ ప్రజలు స్వాగతించాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
హార్థిక్ పటేల్ రాజీనామాతో కాంగ్రెస్‌లో కష్టాలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. మొన్న రాజస్థాన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ సమావేశంలో.. యువతను ప్రోత్సాహిస్తామని, 50 శాతం యువతకు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలో గుజరాత్‌లో జరగబోయే ఎన్నికలతో తమ ప్లాన్ అమలు చేయాలని భావించింది. హార్థిక్ పటేల్‌తో బీజేపీ కుంభ స్థలమైన గుజరాత్‌లో పోటీకి దింపాలని అనుకుంది. ఇంతలోనే హార్థిక్ పటేల్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే గత కొంత కాలంగా హార్థిక్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు తనను పక్కన పెట్టడంతో రాజీనామా చేసినట్లు సమాచారం.