పెప్సి కో కేసు వేయడంతో ఈ విషయం తెలిసిన యావత్ భారత ప్రజానీకం సోషల్ మీడియాలో గళమెత్తింది. మేం ఏం పండించాలో, ఏం పండించకూడదో చెప్పేందుకు మీరెవరు..? అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పెప్సికోపై సోషల్ మీడియాలో విరుచుకు పడ్డారు.
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ..! అని సుమతీ శతకంలో మనం చదువుకున్నాం. అంటే.. ఎంతటి బలవంతమైన పామును అయినా సరే.. బలహీనమైన చీమలన్నీ ఒక్కటైతే సులభంగా చంపేస్తాయి.. అని అర్థం.. అవును, ప్రజానీకమంతా ఒకేతాటిపై నిలబడి పోరాడితే ఎంతటి పెద్ద బహుళజాతి కార్పొరేట్ సంస్థ అయినా దిగి రావల్సిందే.. అదే ఇప్పుడు తాజాగా రుజువైంది కూడా.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
గత కొద్ది రోజుల కిందట ప్రముఖ బహుళజాతి కార్పొరేట్ సంస్థ పెప్సికో గుజరాత్ రైతులు FL-2027 అనే రకానికి చెందిన ఆలుగడ్డలను పండించినందుకు గాను వారిపై కోర్టులో కేసు వేసి రూ.1.05 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది కదా. తాము తయారుచేసే లేస్ చిప్స్‌కు సదరు ఆలుగడ్డలను వాడుతామని, వాటిని పండించే హక్కు తమకే ఉందని చెబుతూ.. ఆ ఆలుగడ్డలను ఎప్పటి నుంచో సాగుతున్న బీద రైతులపై పెప్సీ కో కేసు పెట్టి కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది.
అయితే అలా పెప్సి కో కేసు వేయడంతో ఈ విషయం తెలిసిన యావత్ భారత ప్రజానీకం సోషల్ మీడియాలో గళమెత్తింది. మేం ఏం పండించాలో, ఏం పండించకూడదో చెప్పేందుకు మీరెవరు..? అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పెప్సికోపై సోషల్ మీడియాలో విరుచుకు పడ్డారు. పెప్సీకో చెందిన కూల్‌డ్రింక్స్, చిప్స్ ఏమీ కొనవద్దని ప్రచారం చేశారు. అయితే తమ ఉత్పత్తులను పెద్ద ఎత్తున భారతీయులు నిరాకరిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పెప్సీ కో ఎట్టకేలకు దిగివచ్చింది. రైతులపై పెట్టిన కేసులను ఉప సంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో రైతులే కాదు, యావత్ భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు అయితే తాము చేసిన పోరాటానికి విజయం దక్కిందని, ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థపై సోషల్ మీడియా ద్వారా విజయం సాధించామని గర్వపడుతున్నారు. అవును మరి.. అలాంటి కార్పొరేట్ కంపెనీలకు అలాగే బుద్ధి చెప్పాలి. లేకపోతే వారు మనపైకెక్కి స్వారీ చేస్తారు. ఏది ఏమైనా.. భారతీయులందరూ కలసి కట్టుగా సాధించిన విజయమిది..! అంతేకదా..!