టీఢీపీ : ఒక మ‌హానాడు.. ఒక మ‌హా ప్ర‌శ్న

-

జెండా పండుగ వేళ జెండాలు మోసే కార్య‌క‌ర్త‌ల‌కు ఏం చేస్తారు ఇదే మహా ప్రశ్న. వింటున్నారా బాబూ!

తెలుగుదేశం పార్టీ నేతృత్వాన ఏటా జ‌రిగే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు పూర్తి కావ‌స్తున్నాయి. అధినేత చంద్ర‌బాబు నేతృత్వంలో ఇవాళ మంగ‌ళ‌గిరి నుంచి ఒంగోలు వ‌ర‌కూ భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. పార్టీలో ఉత్తేజం నింపే దిశ‌గా ఈ బైక్ ర్యాలీ సాగ‌నుంది. ఇప్ప‌టికే వివిధ జిల్లాల నుంచి శ్రేణులు ముందుగా మంగ‌ళ‌గిరి చేరుకుని అక్క‌డి నుంచి ఒంగోలు మ‌హానాడు ప్రాంగ‌ణానికి చేరుకోనున్నారు. పార్టీకి చెందిన సీనియ‌ర్లు వీరికి దిశా నిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా మ‌హానాడు సంద‌ర్భంగా అధినేత ఏం వరాలు ఇస్తారు అన్న‌ది ఓ సంశ‌యంగా ఉంది.

మ‌హానాడు అంటే రెండు రోజుల పాటు జ‌రిగే పండుగ. ఇది ఎన్టీఆర్ హ‌యాం నుంచి కొన‌సాగుతున్న ఆన‌వాయితీ. ఇప్పుడు చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రుగుతున్న ఈ పండుగ‌కు కొన్ని విశిష్ట‌త‌లు ఉన్నాయి. కొన్ని విశేషాలూ ఉన్నాయి. ఎన్టీఆర్ వందో పుట్టిన్రోజు పండుగ వేళ అధినేత అనూహ్యంగా విప‌క్ష నేత హోదాలో ఉన్నారు. పార్టీ ఎలా కాద‌న్నా పిల్లాడ‌యిన  జ‌గ‌న్ చేతిలో ఓడిపోయింది. ఆ రోజు పిల్లాడ‌యిన జ‌గ‌న్ ను నిలువ‌రించినంత సులువుగా ఇప్పుడు టీడీపీ నిలువ‌రించ‌లేక‌పోతోంది. కార‌ణం ఏమ‌యినా కూడా జ‌గ‌న్ స్పీడుకు బ్రేకులు వేయ‌లేక‌పోతోంది. కొన్ని సార్లు పై చేయి సాధించినా., కొన్నిసార్లు మాత్రం వ్యూహాత్మ‌క రీతుల్లో త‌ప్పులు దొర్లిపోతున్నాయి. ఈ ద‌శ‌లో బాబు ఏ విధంగా త‌న త‌ప్పులు దిద్దుకుంటారు అదేవిధంగా పార్టీని ఏ విధంగా గాడిలో పెడ‌తారు అన్న‌దే కీల‌కం.

ప్ర‌తి పార్టీకి కార్య‌క‌ర్త‌లే కీలకం అంటారు. ముఖ్యం అంటారు. కానీ అధికారంలోకి వ‌చ్చాక కార్య‌క‌ర్త‌ల‌కు ద‌క్కిందేంట‌న్న‌ది ఓ ప్ర‌శ్న.చంద్ర‌బాబు ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల బీమా అందిస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల బాగు కోసం వారి సంక్షేమం కోసం క‌ష్ట కాలంలో ఉంటే ఆదుకోవ‌డం కోసం ఐదు ల‌క్ష‌లు ఇస్తుంది. ఏద‌యినా క‌ష్టం వ‌స్తే అధినేత క‌న్నా ముందే పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి తోటి కార్య‌క‌ర్త‌నో నాయ‌కుడినో ఆదుకుంటున్న దాఖ‌లాలు జ‌న‌సేన‌లో ఉన్నాయే కానీ టీడీపీలో లేవు. ఇక‌పై ఉంటాయా అన్న‌ది మ‌హా ప్ర‌శ్న. పొలిటిక‌ల్ మైలేజీ కోస‌మే కొన్ని సంద‌ర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో బాధిత వ‌ర్గాల‌కు పార్టీ త‌ర‌ఫున సాయం చేసిన దాఖ‌లాలు ఉన్నాయే కానీ కార్య‌క‌ర్త‌ల‌కు పూర్తిగా ఆర్థిక  భ‌రోసా ద‌క్కిన సంద‌ర్భాలు అరుదు. పార్టీ నిల‌దొక్కుకోవాలంటే  కార్య‌క‌ర్త‌ల‌కు ఏ విధంగా అండ‌గా ఉంటామ‌న్న‌ది చంద్ర‌బాబు చెప్పాలి. ఇదే మ‌హా ప్ర‌శ్న.

Read more RELATED
Recommended to you

Latest news