భీమవరంలో తనను అరెస్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. జూలై 4 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ భీమవరానికి రానున్నారు. పట్టణంలో మోదీ ప్రసంగించి వెళ్లిపోయిన వెంటనే రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని కొందరు పథకం పన్నారని, ఆ తర్వాత ఆ ఘర్షణలకు తానే కారణమని కేసులు పెట్టేందుకు పెద్దలు కుట్ర చేస్తున్నారని రఘురామరాజు పేర్కొన్నారు. ఇలాంటి వాటికి తాను భయపడే రకం కాదని, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం అని అన్నారు.
అంతే కాదు పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన దారిలో తాను వచ్చి వెళ్లిపోతానని.. ప్రభుత్వ పెద్దలు ఎక్కువ చేస్తే ప్రధాని సమక్షంలోనే తన రక్షణ గురించి అభ్యర్థించాల్సి వస్తోందన్నారు. ప్రధాని సభ జరిగే ప్రాంతంలో తన ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదని, కడితే తొలగించాలని అధికారులను జగన్ ఆదేశించినట్లు తనకు తెలిసిందన్నారు. అభిమానులు తన ఫ్లెక్సీలు కట్టి తీరుతారని.. ఎవరేం చేస్తారో చూస్తానని రఘురామ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.