ఏపీలో వైసీపీ ఏకంగా 143 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందని తేలింది. ఇక హిందూపుర్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సినీ నటుడు బాలకృష్ణ ఈ సారి ఓడిపోతారని ఆ సర్వే చెబుతోంది.
దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాలతోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో ఫలితాల కోసం యావత్ దేశ ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రజలు తమను మరో 5 ఏళ్ల పాటు పాలించబోయే నాయకుడు ఎవరు అనేది తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏపీలో వైకాపాకే అధికారం వస్తుందని చెప్పగా.. తాజాగా మరొక సర్వే కూడా తెరపైకి వచ్చింది. దాని ప్రకారం ఏపీలో వైసీపీకి బంపర్ మెజారిటీ వస్తుందట. 175 అసెంబ్లీ సీట్లలో మొత్తం 143 సీట్లు వైకాపాకే వస్తాయని తాజాగా మరొక సర్వే చెబుతోంది.
ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో అనేక ఇతర కంపెనీలు అనేక సర్వేలు చేసి ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని ఇప్పటికే చెప్పేశాయి. ఈ క్రమంలోనే మరొక సర్వే కూడా ఆ విషయాన్ని తెలియజేసింది. ఆ సర్వే ప్రకారం.. ఏపీలో వైసీపీ ఏకంగా 143 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందని తేలింది. ఇక హిందూపుర్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సినీ నటుడు బాలకృష్ణ ఈ సారి ఓడిపోతారని ఆ సర్వే చెబుతోంది. దాని ప్రకారం ఈ సారి బాలకృష్ణ 3500 ఓట్ల మెజారిటీతో ఓడిపోతారని తేలింది.
ఇక సదరు సర్వే చెబుతున్నప్రకారం… ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోతారని తేలింది. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి 14వేల నుంచి 16వేల మెజారిటీతో గెలుస్తారని తెలిసింది. అలాగే జనసేన అధినేత పవన్ తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలవుతారని తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాల వారీగా చూస్తే.. వైసీపీకి శ్రీకాకుళంలో 7 అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలుస్తుండగా, విజయనగరంలో 7, విశాఖపట్నంలో 12, తూర్పు గోదావరిలో 15, పశ్చిమ గోదావరిలో 13, కృష్ణా జిల్లాలో 11, గుంటూరులో 14, ప్రకాశంలో 11, నెల్లూరులో 10, కడపలో 10, కర్నూలులో 11, అనంతపూర్‌లో 11, చిత్తూరు జిల్లాలో 11 అసెంబ్లీ సీట్లు వస్తాయని సమాచారం. మరి సర్వే ప్రకారం… రేపు విడుదల అయ్యే ఫలితాల్లో వైసీపీకి నిజంగానే బంపర్ మెజారిటీ స్థానాలు లభిస్తాయా, లేదా అన్నది తేలాలంటే మరికొన్ని గంటల పాటు వేచి చూడక తప్పదు..!