వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ సమావేశాలు రేపు, ఎల్లుండి గుంటూరులో జరుగనున్నాయి. అయితే.. నేడు సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం పులివెందులులోని ఏపీకార్ల్‌లో న్యూటెక్ బయోసైన్సెస్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ప్రస్తుత రోజుల్లో ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ ఎంపిక అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రసాయనాలు కలిగిన ఆహారాల వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని, ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గమని అభిప్రాయపడ్డారు సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై ఎక్కువగా దృష్టి సారించాలని, గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరమని సీఎం జగన్ సూచించారు. ఆర్బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్. సేంద్రియ వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం తరపున అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు సీఎం జగన్.