తెలంగాణ రాజకీయాలు క్రమక్రమంగా మారిపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలహీనపడుతుండటంతో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతోంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నాయకులు బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరకపోయినా తెరాస పార్టీ కేంద్రంలోని అధికార పార్టీతో దోస్తీ చేసింది. కేంద్రంలో తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థించింది. పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదానికి మద్దతు తెలిపింది.
కానీ లోక్ సభ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ బలపడటంతో ఈ రెండూ పార్టీల మధ్య విమర్శనాశ్త్రాలు తారాస్థాయికి చేరుకున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేంధర్ విజయడంఖా మోగించడంతో ఈ రెండు పార్టీల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో మార్పు అవసరం, ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారాస పార్టీ ఉద్భవిస్తున్నట్టు ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ఇటీవల జరిగిన గులాబీ ప్లీనరీలో సైతం దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఉప్పందించారు.
దేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీల పరిస్థితి ఎలా ఉంది.?
దేశంలో ఇప్పటివరకూ జాతీయ పార్టీలు అంటే టక్కున గుర్తొచ్చేవి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. ఇవి కాకుండా బహుజన సమాజ్ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎన్‌పీపీ వంటి పార్టీలు కూడా జాతీయ పార్టీలుగా కొనసాగులతున్నాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు తప్పా మిగిలిన ఏ పార్టీకి ఒకటికి మించి ఏ రాష్ట్రంలో బలమైన క్యాడర్, నాయకత్వం లేదు.
తృణమూల్ కాంగ్రెస్ మణిపూర్, త్రిపుర, జార్ఖండ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ దాటి ఇతర రాష్ట్రాల్లో అధికార పగ్గాలను చేజిక్కించుకోవడం లేదు. బీఎస్పీ ఉత్తర ప్రదేశ్‌లోనే తన ప్రభను కోల్పోయింది. ఎన్సీపీ మహారాష్ట్రలో ప్రధానంగా కార్యకలాపాలు సాగిస్తోంది. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో విస్తరించడానికి శ్రమిస్తోంది. ఆమ్ఆద్మీ సైతం జాతీయ పార్టీగా అవతరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్‌లో ప్రభుత్వానికి ఏర్పాటు చేశాకా మోదీకి కేజ్రీవాలే ప్రత్యామ్నాయం అనే చర్చ నడిచింది.
తెలుగు రాష్ట్రాల మాటేంటి..?
తెలుగు రాష్ట్రాల్లో బలమైన క్యాడర్ కలిగిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. దానికి గతంలో తెలంగాణలోనూ ఘన చరిత్ర ఉంది. కానీ పార్టీ అధినాయకత్వం ఏపీలో కేంద్రీకృతం అయ్యింది. ఆ రాష్ట్రంలో మాత్రమే అధికారం చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో తెదేపా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపైనే దృష్టి సారించింది. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడమో లేక జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చెయ్యడమో చేసే అవకాశం ఈ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే దృష్టి సారించాల్సిరావొచ్చు.
ఆ తరువాత ఇతర రాష్ట్రాల సమస్యలపై దృష్టి సారించగలరు. తెలంగాణ లేదా ఆంధ్రా అనే ప్రశ్న తలెత్తినప్పుడు కేసీఆర్ తెలంగాణ వైపే మొగ్గచూపుతారు..అసలు రాష్ట్ర విభజన సమయంలో ఉన్న పంచాయతీలపై బారాస ఎక్కువ ఫోకస్ చేయకపోవచ్చు.. ఎందుకంటే..జాతీయ స్థాయిలో విస్తరించినప్పుడు ఇలాంటి పంచాయితీలు పెట్టుకుంటే.. అటు సొంత రాష్ట్రంలో కేసీఆర్ క్యాడర్ దెబ్బతింటుంది. ఇటు ఆంధ్రాలో ఎలాగూ కేసీఆర్‌కు మద్దతు ఉండదు..ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది.
ఇతర రాష్ట్రాల్లో పార్టీని నిర్మించుకోవాలంటే అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. భారాస అధినాయకుడు స్థానికేతరుడనే భావన అక్కడి ప్రజలకు కలగనివ్వొద్దు. అన్ని ప్రాంతాల వారికి చేరువయ్యేందుకు ఒక కామన్ ఎజెండాను రూపొందించుకోవాలి. ఈ విషయాల్లో భారాస ఎలా వ్యవహరిస్తుందో అన్న అంశాలపైనే ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
అంకెలపై ఆధారపడిన భవితవ్యం..
దేశంలో అంకెల గారడే అధికారం ఎవరిదనేది నిర్ణయిస్తుంది. అందుకే దేశంలో ప్రధాన రాజకీయాలు లోక్‌సభ స్థానాలు ఎక్కువగా కలిగిన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా కేంద్రీకృతం అవుతాయి. ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎంపీ సీట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపైనే దృష్టిసారిస్తాయి.
ఇక్కడ గట్టిపట్టు పడితే దిల్లీ పీఠాన్ని అధిరోహించడం సులువవుతుంది. ప్రధాన రాజకీయ తారాగణం ఈ రాష్ట్రాలే కేంద్రంగా ప్రచారం నిర్వహిస్తాయి. కానీ కేవలం 17 లోక్ సభ స్థానాలు ఉన్న తెలంగాణ కేంద్రంగా భారాస ఎంతవరకు అధికారం చేజిక్కించుక్కోవడం కోసం జాతీయ రాజకీయాల్లో రాణిస్తుంది? బీజేపీని గద్దె దించడంలో ఇది ఎంత వరకు సఫలమవుతుంది.. అనే విషయాలకు కాలమే సమాధానం చెబుతుంది.
బారాస జాతీయ పార్టీ లేదా కూటమి అయినా.. కేసీఆర్ మొదటి ప్రాముఖ్యత సొంతం రాష్ట్రం పైనే ఉంటుంది. ఇప్పటి వరకూ ఏ జాతీయ పార్టీ సొంత రాష్ట్రాన్ని వదిలేసి పోలేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాదని ఏం చేయలేదు. అదే పంతాలో బారాస కూడా ఉండొచ్చు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయికి ఎదగాలంటే.. ఎన్నో సవాళ్లను అధిగమించాలి, ఇతర రాష్ట్రాల మద్దతు కావాలి, కేసీఆర్ మరీ పొరుగు రాష్ట్రాలను ఎంత వరకు గుప్పెట్లో పెట్టుకోగలుగుతారో చూడాలి.!
-Triveni Buskarowthu