ఏపీలో గత ఐదు రోజలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా-గోదావరి నదుల్లోకి పెద్ద ఎత్తున వరద ప్రవహం వస్తుందన్నారు. జులై రెండో వారంలోనే గోదావరికి ఇంత పెద్ద ఎత్తున వరద గత 100 ఏళ్లల్లో ఎప్పుడూ జరగలేదు. ఆకస్మికంగా వరదలు రావడం వల్ల కొఁత ఇబ్బంది ఏర్పడింది. నిర్వాసితుల తరలింపుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరిలో 16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మరింత వరద వచ్చే సూచనలు కన్పిస్తోంది. వరద వల్ల వచ్చే ఇబ్బందులను వీలైనంత మేర తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్జీఓల సేవలు తీసుకుంటాం. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి వరద ఉధృతంగా ఉంది. పెన్నా నదిపై గతంలో ఉన్న ఆనకట్టల ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. వచ్చే నెల 17వ తేదీన నెల్లూరు, సంగం బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఈ రెండు బ్యారేజీల ఆధునికీకరణ పనులను వైఎస్ శంకుస్థాపన చేస్తే.. జగన్ ప్రారంభిస్తున్నారు.కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల్లో నీళ్లని నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. గోదావరిపై పెద్దగా డ్యాములు లేవు.. భద్రాచలం నుంచి వచ్చే నీరంతా నేరుగా పోలవరం వద్దకు చేరుతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగలం. ప్రస్తుతం పోలవరం వద్ద 16 లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా విడుదల అవుతోంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తి కాకపోవడంతో కొద్దిపాటి ఇబ్బంది ఉంది. పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న వరదల వల్ల ఢయాఫ్రమ్ వాల్ కు ఎలాంటి కొత్తగా జరిగే డామేజ్ ఏం ఉండదు. గతంలో వచ్చిన రెండు వరదల కారణంగా ఢయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.. ఇంతకు మించి ఈ వరదల వల్ల జరిగే నష్టం ఏం ఉండదు అని ఆయన వివరించారు.