ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి గురువారం రాత్రి రాజీనామా చేశారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండానే దేశం వదిలి పారిపోయిన రాజపక్స… గురువారం రాత్రి సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ చేరిన తర్వాత ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ లేఖను శ్రీలంక పార్లమెంటు స్పీకర్‌కు పంపారు.
శ్రీలంకలో జనాగ్రహం పెల్లుబుకుతున్న వేళ వేలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించి అందులోకి ప్రవేశించారు. ఈ ఘటనకు ముందుగానే అధ్యక్ష భవనాన్ని వీడిన గొటబాయ… మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. చివరికి రాజపక్స సింగపూర్ చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.