జావెలిన్ త్రో స్టార్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2022 ఫైనల్ కు నీరజ్ చోప్రా చేరుకున్నాడు. శుక్రవారం ఒరెగాన్ లోని యూజీన్ క్వాలిఫైయింగ్ తన మొదటి ప్రయత్నంలో 88.39 మీటర్ల త్రో తో తన తొలి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ లోకి ప్రవేశించాడు.
నీరజ్ తో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్ కు చేరుకున్నాడు. ఇక ఫైనల్స్ భారత కాలమానం ప్రకారం ఆదివారం జరగనున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో నీరజ్ చోప్రా పథకం సాధిస్తే.. రెండో భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఇప్పటివరకు భారత్ కేవలం ఒకే ఒక పథకం మాత్రమే సాధించింది. 2003లో ప్యారిస్ లో జరిగిన ప్రపంచ అథలిటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత లాంగ్ జంపర్ అంజు బాబి జార్జి కాంస్య పథకం సాధించింది.