నేడు సౌతాఫ్రికాతో భార‌త్‌ ఢీ.. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో బోణీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న టీమిండియా..!

-

సౌతాంప్ట‌న్ వేదిక‌గా సౌతాఫ్రికాతో నేడు భార‌త్ మ్యాచ్ ఆడ‌నుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి నాయ‌క‌త్వంలో టీమిండియా తొలి పోరుకు సిద్ధ‌మైంది.

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో భార‌త్ నేడు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. ఇప్పటికే టోర్నీలో ఆయా జ‌ట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడ‌గా, భార‌త్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఈ క్ర‌మంలో ప‌లు అగ్ర‌శ్రేణి జ‌ట్లు వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీని ఘ‌నంగా ప్రారంభించాయి కూడా. త‌మ త‌మ తొలి మ్యాచ్‌ల‌లో అద్భుతంగా బోణీ కొట్టాయి. ఇక ఇవాళ భార‌త్ కూడా త‌న తొలి మ్యాచ్ ఆడ‌నున్న నేప‌థ్యంలో ఇత‌ర అగ్ర‌శ్రేణి జ‌ట్ల‌లాగే టీమిండియా కూడా ఈ మ్యాచ్‌ను ఘనంగా ఆరంభిస్తుందా.. అద్భుత‌మైన బోణీ కొడుతుందా.. లేదా.. అని అభిమానులంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సౌతాంప్ట‌న్ వేదిక‌గా సౌతాఫ్రికాతో నేడు భార‌త్ మ్యాచ్ ఆడ‌నుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి నాయ‌క‌త్వంలో టీమిండియా తొలి పోరుకు సిద్ధ‌మైంది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఈ సారి ఎలాగైనా సాధించాల‌ని టీమిండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. సౌతాఫ్రికాపై విజ‌యం సాధించి, టోర్నీలో బోణీ కొట్టాల‌ని టీమిండియా ఉత్సాహంగా ఉంది. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లి సేన అన్ని అంశాల్లోనూ ఇత‌ర జ‌ట్ల క‌న్నా ఎంతో మెరుగ్గా క‌నిపిస్తోంది. అలాగే ఇవాళ జ‌రిగే మ్యాచ్‌లో స‌ఫారీల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌త్యేక వ్యూహాల‌తో ముందుకు సాగాల‌ని టీమిండియా భావిస్తోంది.

అయితే మ‌రోవైపు సౌతాఫ్రికా మాత్రం తీవ్ర ఒత్తిడితో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రెండు మ్యాచుల్లో ఓట‌మి పాలైన స‌ఫారీలు ఈసారైనా గెలిచి టోర్నీలో బోణీ కొట్టాల‌ని చూస్తున్నారు. కానీ జ‌ట్టులో కీల‌క ఆట‌గాళ్ల‌యిన డేల్ స్టెయిన్‌, ఎంగిడిలు గాయాల కార‌ణంగా అందుబాటులో లేక‌పోవ‌డం స‌ఫారీల‌ను మ‌రింత క‌ల‌వ‌ర పెడుతోంది. అస‌లే బంగ్లాదేశ్ చేతిలో జ‌రిగిన దారుణ ప‌రాభ‌వాన్ని ఇంకా జీర్ణించుకోని సౌతాఫ్రికా ఇవాళ గ‌న‌క టీమిండియా చేతిలో ఓడిపోతే అది ఆ జ‌ట్టును మ‌రింత కుంగ దీసే అవ‌కాశం ఉంది. అయితే మ‌రి.. స‌ఫారీలు ఇవాళ ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి భార‌త్‌ను ఓడిస్తారా.. లేదా ఒత్తిడి బారిన ప‌డి ఈ మ్యాచ్‌లోనూ ఓట‌మి పాలవుతారా.. అన్న వివ‌రాలు తెలియాలంటే.. మ‌రికొన్ని గంట‌లు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news