14వ భారత రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఆదివారంతో ముగియనున్నది. రేపే ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత సోమవారం (ఈ నెల 25న) భారత కొత్త రాష్ట్రపతిగా ఇటీవలే ఎన్నికైన ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో పదవి నుంచి దిగిపోతున్న రామ్ నాథ్ కోవింద్‌కు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పద్మ అవార్డు గ్రహీతలు, ముర్ము సామాజిక వర్గానికి చెందిన గిరిజన, ఆదివాసీ తెగలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ విందుతో తెలంగాణకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య హాజర్యారు. విందులో పాలుపంచుకున్న ఆయనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫొటో దిగారు.