వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వర్గాల నేతలకు కీలక పదవులు ఇస్తూ కసరత్తు చేస్తున్నారు. అయితే.. 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన బుట్టా రేణుకకు తాజాగా ఆ పార్టీలో జిల్లా స్థాయి పదవి దక్కింది. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక… ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో కర్నూలు నుంచి ప్రముఖ వైద్యుడు సంజీవ్ కుమార్‌ను వైసీపీ బరిలోకి దించి ఎంపీగా గెలిపించుకుంది. అయితే ఎన్నికలకు కాస్తంత ముందుగా బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. అయితే పార్టీ టికెట్ ఆశించకుండా ఉండేటట్టు అయితేనే పార్టీలోకి రావచ్చన్న వైసీపీ నిబంధనకు లోబడే ఆమె తిరిగి తన సొంత గూటికి చేరారు.
అటు ప్రజా ప్రతినిధిగా అవకాశం దక్కగా…ఇటు పార్టీలో పదవి దక్కక చాలా కాలంగా బుట్టా రేణుక రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు. తాజాగా వైసీసీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తూ ఆ పార్టీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే బుట్టా రేణుకను ఆ పదవిలో నియమిస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో.. బుట్టా రేణుక అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.