మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో 18 మందికి చోటు లభించింది. 9 మంది భాజపా ఎమ్మెల్యేలు, మరో 9 మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా మంగళవారం ముంబయిలో ప్రమాణ స్వీకారం చేశారు.
భాజపా నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగటివార్, గిరిష్ మహాజన్, సురేశ్ ఖాడె, రాధాకృష్ణ విఖె పాటిల్, రవీంద్ర చవాన్, మంగల్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సావె మంత్రి పదవి దక్కించుకున్నారు. శివసేన వర్గం నుంచి దాదా భూసే, శంభురాజే దేశాయ్, సందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసార్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథౌడ్కు మంత్రి పదవి దక్కింది.
రాష్ట్రంలో భాజపా- శివసేన(శిందే వర్గం) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు వ్యక్తులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ ఏక్నాథ్ శిందే, ఫడణవీస్ లక్ష్యంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు చర్యలు తీసుకుంది.