టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, నేతలు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, స్వార్థ రాజకీయాల కోసం కొందరు పార్టీని వీడితే వచ్చే నష్టమేమీ లేదని చంద్రబాబు అన్నారట.
టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే వారు బీజేపీలో చేరనున్నారు. అందులో భాగంగానే వారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలిసి తమను ఒక గ్రూపుగా పరిగణించాలని లేఖ రాశారు. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాలలో ఉండగా.. ఇప్పుడు ఈ సంఘటన జరగడంతో ఏపీ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.
అయితే తమ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరుతుండడంపై చంద్రబాబు స్పందించారు. ఇంతకీ ఈ విషయంపై ఆయన ఏమన్నారంటే… టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, నేతలు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, స్వార్థ రాజకీయాల కోసం కొందరు పార్టీని వీడితే వచ్చే నష్టమేమీ లేదని అన్నారట. అలాగే చంద్రబాబు పార్టీ సీనియర్లతో కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారని, బీజేపీ చర్యల్ని బాబు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారని కూడా తెలుస్తోంది.
అయితే మరోవైపు కాకినాడలో కాపు నేతలు సమావేశమైన విషయంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా స్పందించారు. న్యూస్ చానళ్లలో వచ్చిన కథాలు చూశానని, తాను నేతలతో మాట్లాడుతున్నానని, ఎంపీలు పార్టీ మారుతున్న విషయంపై తనకు సమాచారం లేదని, టీడీపీ ఎంపీలతో మాట్లాడుతున్నానని తెలిపారు. అలాగే కాకినాడలో సమావేశమైన టీడీపీ కాపు నేతలతో మాట్లాడానని.. వారు పార్టీ ఓటమికి గల కారణాలను చర్చించారని, అదే విషయం తనకు తెలిసిందే తప్ప.. ఇక ఎవరూ పార్టీ మారే ఆలోచనలో లేరని అన్నారు. మరి ముందు ముందు ఇంకా టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. విదేశీ పర్యటనలో ఉన్న బాబు ఏపీకి వచ్చాక ఎలా స్పందిస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది..!