బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయి. పాతబస్తీ మొత్తం నిరసన జ్వాలలో రగిలిపోతోంది. ఈ క్రమంలో రాజాసింగ్ ను శాసనసభ నుంచి బహిష్కరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మజ్లిస్ కోరింది.
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ లేఖ రాశారు. పదే పదే తన చర్యలతో.. రాజాసింగ్ శాసనసభ్యునిగా అర్హత కోల్పోతున్నారని సభ వెలుపల, లోపల ఆయన వైఖరి కారణంగా అసెంబ్లీ గౌరవానికి భంగం కలుగుతోందని పేర్కొన్నారు.
రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు శాసనసభ్యునిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాయని రాజ్యాంగ మౌలికసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్ అనర్హుడనేందుకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఫిర్యాదులు, పత్రికా కథనాలను లేఖతో జతపర్చడంతో పాటు రాజాసింగ్ తన ప్రవర్తనతో ఇటీవలి అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ అయినట్లు గుర్తుచేశారు.