ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జిల్లాగా మారిన బాపట్లకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా. అక్కడ కొలువైన భావనారాయుడి పేరు మీద బాపట్ల వచ్చిందట. బాపట్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కొంగుబంగారమై భావనారాయణుడు కోరిన కోరికలు తీరుస్తున్నాడు. బాపట్ల ప్రాంతానికి చారిత్రక, పురాతన నేపథ్యం ఉంది. నారాయణుడు భావన్నారాయణుడు ఎలా అయ్యాడో తెలిపే కథ ఆసక్తికరంగా ఉంటుంది.
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మహర్షులు యజ్ఞం చేసిన చోట క్షీర వృక్షము ఆవిర్భవించిందట. విష్ణుమూర్తి అప్పటి నుంచి ఆ క్షీరవృక్షంలో కొలువయ్యాడట. ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే కొండకావూరు గ్రామానికి చెందిన బావ, బావమరుదులు ప్రతి రోజు ఈప్రాంతానికి వచ్చి వంట చేసుటకు అవసరమైన కట్టెలు తీసుకెళ్లేవారట ఒక రోజు బావామరుదులిద్దరిలో బావ క్షీర వృక్షంపై వేటు వేయగా అందులో నుంచి రక్తం కారడంతో అతను మూర్ఛపోయాడు.
బావ కోసం సాయంత్రం బావమరిది వచ్చాడు. అతడి బావ కనిపించకపోయేసరికి బావా, బావా అని పిలుస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడట. అప్పుడు ఓయ్ అనే పిలుపు వినిపించి ఆ వైపు వెళ్లి చూడగా అక్కడ నిర్జీవంగా పడిఉన్న అతని బావ కనిపించాడు. అక్కడున్న వృక్షంలో నుంచి రక్తం రావడం చూసి ఏదో జరిగిందని భావించిన బావమరిది ఆ వృక్షానికి మొక్కి.. తన బావ తిరిగి కోలుకుంటే ప్రతి ఆదివారం పొంగలి పెడతానని మొక్కుకున్నాడట. బావమరిది మొక్కుకోగానే అతడి బావ కళ్లు తెరిచాడు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం కొండకావూరు నుంచి భక్తులు వచ్చి పొంగలి పెట్టేవాళ్లు.
క్రిమికంఠీరవ చోళుడు దండ యాత్రలో భాగంగా ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు ఆయన సైన్యంలో ఏనుగుల మేత కోసం ఈ ప్రాంతానికి వచ్చాయి. పట్టపు టేనుగు క్షీర వృక్షము వద్దకు వెళ్ళి దానికి తినబోయింది. అంతటా ఏనుగు తొండం ఆ చెట్టుకు అంటుకుపోయింది. ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో రాజుకు ఈ విషయం చెప్పారు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి రాజు భక్తితో వేడుకోగా.. తనకు 108 ఏనుగు స్తంభాలతో ఆలయం కట్టించమని స్వామి చెప్పాడట. అందుకే రాజు బొప్పూడి వద్దనున్న రాళ్లతో స్వామి వారి ఆలయ నిర్మాణం చేపట్టాడు.
తెల్లవారేసరికి అంతక ముందు రోజు నిర్మించిన ఆలయం కూలిపోయింది. రాజు మరోసారి స్వామివారిని వేడుకోగా బావ పేరుతో ఉన్న రాళ్లనే తన ఆలయ నిర్మాణానికి ఉపయోగించాలని స్వామి చెప్పాడు. ఆ రాళ్ల కోసం వెతకగా వెంకటగిరి సమీపంలోని చిమ్మిరిబండ వద్ద అలాంటివి ఉన్నాయని తెలిసి ఆ రాళ్లు తీసుకొచ్చి ఆలయం నిర్మించారు. బావ రాళ్లతో నిర్మించిన ఆలయంలో కొలువైన స్వామి కావడంతో ఆయన భావనారాయణుడయ్యాడు. ఈ ఆలయంలో ప్రతి వైశాఖ పౌర్ణమి రోజు స్వామి వారి రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది. ఇలా భావనారాయణుడు కొలువైన ప్రాంతం కావడంతో బాపట్ల పేరు వచ్చింది.