నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని కొందరు జనసేన కార్యకర్తలు పవన్ని కోరారు. కానీ అక్కడ వచ్చే మూడు, నాలుగు వేల ఓట్లు కోసం పోటీ చేయడం అనవసరమని, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో తమకు అనుకూలమైన స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ చెప్పారు.
అయితే జనసేనకు బీజేపీతో పొత్తు ఉంది…కానీ అది ఏపీలోనే నడుస్తోంది. తెలంగాణలో పొత్తు నడవటం లేదు. అసలు పవన్ని తెలంగాణ బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు…వారు సింగిల్ గానే ముందుకెళుతున్నారు. అలాగే ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. పవన్ మద్ధతు కావాలని కూడా కోరడం లేదు…పవన్ కూడా తెలంగాణ బీజేపీ గురించి మాట్లాడటం లేదు. అంటే తెలంగాణలో బీజేపీ-జనసేన సెపరేట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా విడిగా ఉండటం వల్ల రాజకీయంగా బీజేపీకి ఏమైనా ఇబ్బంది వస్తుందా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే తెలంగాణలో జనసేన ప్రభావం చాలా తక్కువ. ఆ పార్టీకి ఒక్క సీటు గెలిచే బలం కూడా లేదని చెప్పొచ్చు. కాకపోతే ఓ 9-10 స్థానాల్లో ప్రభావం చూపించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేన ప్రభావం కాస్త ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏపీ ఓటర్లు ఉంటారు. అందులో కాపు వర్గం వారు కూడా ఉన్నారు.
కూకట్పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్చెరు, ఉప్పల్, ఎల్బీ నగర్, సనత్నగర్ స్థానాల్లో జనసేన ప్రభావం కాస్త ఉండొచ్చు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పవన్ ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. అయితే పవన్ కలిస్తే బీజేపీకి కొంత లాభమే…కానీ విడిగా పోటీ చేస్తే నష్టం జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ స్థానాల్లో ఏపీ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు…ఒకవేళ జనసేన పోటీ చేస్తే కొన్ని ఓట్లు చీల్చి టీఆర్ఎస్ పార్టీకే నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.