పంజాబ్‌లోని లూధియానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబం దుర్మరణం చెందింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఐదుగురు మరణించగా.. ఒకరు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు.
లుధియానాకు చెందిన ఓ కుటుంబం చండీగఢ్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఫోకల్ పాయింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు అదుపుతప్పి డివైడర్‌ను తాకింది. అనంతరం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో అందులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
మృతులను రాజేశ్ కుమార్ (40), అతడి కుమార్తె జాస్మిన్ (5), మరదలు సంజన (30) ఆమె ఇద్దరు కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్ కుమార్ భార్య ప్రియ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రాజేశ్.. ప్రతాప్ కాలనీకి చెందిన ఓ వ్యాపారవేత్త అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నారు.