దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. బీజేపీయేతర శక్తి బలంగా దేశంలో నాటుకుపోతోందని చాటిచెప్పడమే ఈ యాత్ర ధ్యేయమని గతంలోనే రాహుల్ గాంధీ చెప్పారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ వరకు కొనసాగే ఈ పాదయాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు.
ఈ సాయంత్రం కన్యాకుమారి చేరుకున్న రాహుల్ గాంధీ తొలుత స్వామి వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాలు, మాజీ ముఖ్యమంత్రి కామ్‌రాజ్ స్మారకాన్ని సందర్శించారు. అనంతరం మహాత్మాగాంధీ మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. జాతీయ జెండాను రాహుల్‌కు అందించడంతో ఈ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్‌తో పాటు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, హరీశ్ రావత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. అంతకుముందు ఈ ఉదయం రాహుల్ శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ యాత్ర నేడు లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ.. రాహుల్ నడక మాత్రం గురువారం ఉదయం నుంచి మొదలవుతుంది.