జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ జిల్లాలోని సాజిన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలికి పరుగులు తీశారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను మండీలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సైన్యం.. వెంటనే సహాయ చర్యలు చేపట్టింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మినీ బస్సు ప్రమాదంపై జమ్మ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.