జగన్ సర్కారు కు కేంద్రం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఏపీకి రాజధానికి ఒక్క రాజధానిని నిర్మించడానికి అపసోపాలు పడుతున్నారు. అలాంటిది సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గత మూడేళ్లుగా దీంతోనే సాగదీస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రభుత్వం ఊదరగొడుతున్న నేపథ్యంలో, రాష్ట్రాల రాజధాని ఒక్కటేనని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది.
‘నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం మద్దతు’ అని అధికారిక పత్రాల ద్వారా స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఈ నెల 27న కేంద్ర హోమ్ శాఖ సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే ఈ సమావేశం ఏజెండాలో నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం మద్దతు అంశం ఉంటుందని స్పష్టం చేసింది. నూతన రాజధానికి రాపిడ్ రైల్ కనెక్టివిటీ కల్పించడం అనే అంశాన్ని కూడా ఎజెండాలో పేర్కొంది. జగన్ సర్కార్ పదే పదే చెబుతున్నట్లుగా మూడు రాజధానులు అని కాకుండా ‘నూతన రాజధాని’ అని ఒకే రాజధానిగా అర్థం వచ్చేలా ఏజెండాలో చేర్చడం గమనార్హం.