ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని తమ్మినేని ఫైర్ అయ్యారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో పాటు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. వారిని సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు.
టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. అనంతరం స్పీకర్ స్పందిస్తూ ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.