ఏదేమైనా ఈ మధ్య జగన్‌లో బాగా మార్పు కనిపిస్తోంది..ఇప్పటివరకు తాను ఏం చేసినా, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే కాన్సెప్ట్‌లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఏ విషయమైన విడమర్చి చెప్పకపోతే ప్రజలు నమ్మడం కష్టమనే భావనకు వచ్చినట్లు కనబడుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తాను ఏం చేసిన ప్రజలు ఆమోదిస్తారనే కాన్ఫిడెన్స్‌తో రాజకీయం చేస్తూ వచ్చారు. పైగా పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లని ఏకపక్షంగా గెలుచుకున్నారు.
ఈ తీర్పుతో 175 నియోజకవర్గాల్లోని ప్రజలు తమవైపే ఉన్నారనే ధీమాతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోయినా సరే..తనని చూసి ప్రజలు ఓటు వేస్తారని అనుకున్నట్లు కనిపించారు. అంటే ఇంకా తాను ఏం చేసినా, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని భావించారు. కానీ ఇటీవల ఆ పరిస్తితి మారిపోయినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ తీర్వ స్థాయిలో విమర్శలు చేయడం, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం, జగన్ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమలో లోటుపాట్లని ప్రజలకు క్లియర్‌గా వివరిస్తున్నారు.
అదేవిధంగా ఆర్ధిక పరిస్తితి ఏ విధంగా కుంటుపడింది..అభివృద్ధి ఆగిపోవడం, అప్పులు పెరిగిపోవడం, ప్రజలపై పన్నుల భారం పెరగడం, అలాగే మూడు రాజధానుల పేరిట రాజకీయం చేసి..చివరికి రాష్ట్రానికి కంటూ రాజధాని లేకుండా చేయడం, ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో పురోగతి లేకపోవడం..ఇలా ఒకటి ఏంటి అనేక అంశాల్లో టీడీపీ..వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి..ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతుంది.
దీంతో జగన్ రూట్ మార్చారు..ఇక ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మడం కష్టమని చెప్పి..అసెంబ్లీ వేదికగా పెద్ద పెద్ద క్లాస్‌లు చెప్పడం మొదలుపెట్టారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరీ..అప్పులు తక్కువే అని, అభివృద్ధి జరిగిందని, ఆర్ధిక పరిస్తితి బాగుందని, పోలవరం ప్రాజెక్టులో పురోగతి ఉందని, మూడు రాజధానుల వల్ల లాభాలు ఉన్నాయని, అమరావతి వల్ల నష్టమని చెప్పి..వరుసపెట్టి అసెంబ్లీలో క్లాసులు చెబుతున్నారు. అంటే ప్రతి విషయం క్లియర్‌గా వివరించకపోతే దెబ్బపడుతుందని జగన్‌కు అర్ధమైనట్లు ఉంది. అందుకే అసెంబ్లీలోనే క్లాసులు చెబుతున్నారు. మరి ఈ క్లాసులని ప్రజలు నమ్ముతారో లేదో చూడాలి.