మద్య నిషేధం అమలు చేయాలంటే.. మద్యం వినియోగాన్ని ముందుగా తగ్గించాలని… అమ్మకాల సమయాల్లో మార్పులు తీసుకొస్తే కొంతవరకు మద్యం అమ్మకాలను తగ్గించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్న సీఎం.. తాజాగా మద్య నిషేధంపై ఫోకస్ పెట్టారు. మద్య నిషేధం కోసం కొత్త పాలసీని రూపొందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మద్యం అమ్మకాలపై కొత్త రూల్ తీసుకురాబోతున్నారు.
మద్య నిషేధం అమలు చేయాలంటే.. మద్యం వినియోగాన్ని ముందుగా తగ్గించాలని… అమ్మకాల సమయాల్లో మార్పులు తీసుకొస్తే కొంతవరకు మద్యం అమ్మకాలను తగ్గించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం అమ్మకాలు జరపాలని… సాయంత్రం 6 దాటితే మద్యం అమ్మకాలు బంద్ చేయాలని భావిస్తోంది.
మరోవైపు కొత్త లిక్కర్ పాలసీని అక్టోబర్ నుంచి అమలులోకి తీసుకురానున్నారు. దీనిపై ప్రభుత్వం రకరకాల ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. దానిలో సమయం కుదింపు ఒకటి. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీని వల్ల సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. దాన్ని కట్టడి చేయడం కోసం సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అయితే.. మామూలుగా సాయంత్రం నుంచి రాత్రి వరకే మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రే ఎక్కువగా మద్యాన్ని తాగుతుంటారు. సాయంత్రం పూట పనులన్నీ అయిపోయాక.. మద్యాన్ని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోవడమో.. లేక సిట్టింగ్ రూమ్స్ లో కూర్చొనో తాగుతారు. అందుకే రాత్రిపూట వైన్స్ కిటకిటలాడుతుంటాయి. అదే సమయంలో మూసేస్తే మద్యం అమ్మకాలు ఒకేసారి పడిపోతాయని అనుకుంటోంది ప్రభుత్వం.
దీనిపై ఏపీలో ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. మద్యం షాపుల ఓనర్స్ కూడా సాయంత్రం వరకే షాపులు ఉండాలంటే.. ఇక తాము మద్యం షాపులను మూసుకోవాల్సిందేనని అంటున్నారు. చూద్దాం.. ఇది ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో?