టీడీపీ హయాంలో ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన కేసులను పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శితో కేసు నమోదైన ఉద్యోగి శాఖకు చెందిన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా… 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో టీడీపీ పాలన సాగిన సంగతి తెలిసిందే.
ఈ సమయంలో కొందరు ఉద్యోగులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఏసీబీ చేత కేసులు పెట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దిశగా ఏసీబీ కేసులు నమోదైన పలువురు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసులపై పునఃపరిశీలనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఉద్యోగుల కేసులను ఈ పునఃసమీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు.