టాప్ ప్రొడ్యూసర్ కొడుకుతో భాగ్యశ్రీ కూతురు రొమాన్స్..?

-

‘మైనే ప్యార్‌ కియా’ సినిమాతో బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది భాగ్యశ్రీ. తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం ఒక్క సినిమాతోనే 100 సినిమాలకు సరిపడా పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత కన్నడ, తమిళ్‌, బెంగాలీ సినిమాల్లో నటించినా అవన్నీ పూర్తి స్థాయి పాత్రలు కాదు.

పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలలతో ఇంటికే పరిమితమైన భాగ్యశ్రీ పిల్లలు పెద్దయ్యాక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  చాలా ఏళ్ల తర్వాత ‘రాధేశ్యామ్‌’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ‘రాధేశ్యామ్’ కంటే ముందు భాగ్యశ్రీ.. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘తలైవీ’లోనూ మెరిసింది.

తల్లి బాటలోనే భాగ్యశ్రీ కొడుకు, కూతురు కూడా నడుస్తున్నారు. ఇప్పటికే భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దస్సానీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’, ‘మీనాక్షి సుందరేశ్వర్’, ‘నికమ్మా’ మూవీస్ తో బీటౌన్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు భాగ్యశ్రీ గారాలపట్టి అవంతిక దస్సానీ కూడా సినిమాల్లోకీ ఎంట్రీ ఇస్తోంది. అయితే అభిమన్యులా అవంతిక బాలీవుడ్ లో కాదు.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే అవంతిక ‘మిత్యా’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఓ టాప్ ప్రొడ్యూసర్ కొడుకుతో జంటగా నటించడానికి రెడీ అయింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

ఇటీవల ‘స్వాతిముత్యం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ గణేశ్‌. ఇప్పుడు మరో కొత్త సినిమా ‘నేను స్టూడెంట్ సార్‌’ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అవంతిక ఎంపికైంది. ఇందులో ఆమె శృతి వాసుదేవన్‌ అనే కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు మూవీ మేకర్స్‌. ఎంతో స్టైలిష్‌ అండ్‌ క్యూట్‌గా ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

సముద్రఖని, సునీల్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జ‌రుపుకుంటోంది. మరి భాగ్యశ్రీ గారాలపట్టి టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో చూడాలంటే నేను ‘స్టూడెంట్ సార్’ సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news