ఏదో అనుకుంటే ఏదో జరిగిందనట్లు..వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్..ఇప్పుడు మూడు ప్రాంతాల్లో లాభం కంటే..మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని చెప్పి..అమరావతి రాజధానికి మద్ధతు ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూడా అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు.
కానీ ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు. పైగా మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు అయింది..కానీ ఇంతవరకు మూడు కాదు కదా..అసలు ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్తితికి వచ్చింది. ఇక మూడేళ్లు నుంచి అమరావతి రైతులు, ప్రజలు మాత్రం..అమరావతిని రాజధానిగా ఉంచాలని చెప్పి ఉద్యమం చేస్తున్నారు…ఇప్పుడు అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు.
అయితే మూడేళ్ళ వరకు పోరాటం చేయని వైసీపీ..ఇప్పుడు ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్లు..విశాఖ రాజధాని అంటూ పోరాటం మొదలుపెట్టింది. ఉత్తరాంధ్రలో రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టి వైసీపీ లబ్ది పొందడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తోంది. ఇదిలా నడుస్తుంటే..అమరావతికి మద్ధతు ఇస్తూనే..మూడు రాజధానుల పేరుతో వైసీపీ విశాఖని దోచుకుందని చెప్పి టీడీపీ పోరాటం చేస్తుంది. మొత్తానికి రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెంటిమెంట్ లేపి దాంతో రాజకీయ క్రీడ ఆడాలని పార్టీలు చూస్తున్నాయి.
ఇదిలా జరుగుతుండగానే ఇప్పుడు రాయలసీమలోని కొందరు నేతలు కొత్త నినాదం ఎత్తుకున్నారు. అమరావతితో పోలిస్తే విశాఖ రాయలసీమకు చాలా దూరమైపోతుందని, విశాఖను రాజధాని చేస్తే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే కడప రాజధానిగా ప్రకటిస్తూ గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. టీడీపీ నేతలు ఈ అంశాన్ని భుజాన వేసుకున్నారు. మొత్తానికి రాజధాని పేరుతో అటు వైసీపీ, ఇటు టీడీపీ గేమ్ ఆడుతున్నాయి. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి..ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు.