గత వారం సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉత్తర ప్రదేశ్ వెళ్లిన కేసీఆర్…ఆ కార్యక్రమం అనంతరం అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు సోమవారం జ్వరం వచ్చింది. ఇప్పటికే వారం పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటున్నారు. తాజాగా సోమవారం సీఎం కేసీఆర్ జ్వరం బారిన పడటంతో మరో నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు.
పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ వారిని ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అయితే దాదాపు వారం రోజులు గడుస్తున్నా.. సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండటంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ కీలకమైన ఉన్నతాధికారులను ఢిల్లీకి రావాలని వారిని ఆదేశించినట్టు తెలుస్తోంది. వారితో కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన అంశాలను చర్చించి వారికి కీలక ఆదేశాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీలో ఉంటారు ? అసలు ఆయన ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండటానికి కారణం ఏంటనే విషయాన్ని టీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి.