మంగళగిరిలో వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. పవన్ తన ఫ్రస్ట్రేషన్ అంతా ఈ మీటింగులో చూపించారని.. ఆయనకు స్థిరత్వం లేదని అన్నారు. మూడో భార్య కూడా వదిలేసినట్లుందని.. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నారని అమర్ నాథ్ అన్నారు. చెప్పుతో కొడతామని అనడం ఆయన వైఖరికి నిదర్శనమని.. గత ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయణ్ను ఓడించి చెప్పుతో కొట్టారని.. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడమంటే అదేనని అన్నారు.
ఆడవాళ్లపై గౌరవం ఉందని చెబుతూనే పవన్ కల్యాణ్ నీచంగా మాట్లాడారని అమర్ నాథ్ మండిపడ్డారు. ఒక పెళ్లి చేసుకుని 30 స్టెపినీలతో తిరుగుతున్నామని పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాము ఒక పెళ్లితో 30 స్టెపినీలతో తిరిగితే.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పీకే 3వేల మందితో తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. అసలు పీకే అంటే పెళ్లిళ్ల కల్యాణ్ అని పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. లేదంటే పిచ్చికుక్క బెటర్ అని అదీకాకపోతే ప్యాకేజ్ కల్యాణ్ కరెక్ట్ గా సరిపోతుందని అమర్ నాథ్ అన్నారు.
పవన్ కల్యాణ్ ని తన మూడో భార్య కూడా వదిలేసినట్టుందని.. ఆ ఫ్రస్ట్రేషన్ ఇవాళ వైసీపీ నాయకులపై చూపించినట్టున్నారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. తన దాంపత్య జీవితంలానే పవన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఒకరిని వదిలేసి మరొకరిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లే.. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ ఐదు పార్టీలతో పొత్తుపెట్టుకుని మళ్లీ వదిలేశారని అన్నారు.