ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసింది. మంత్రాలయం నుంచి తుంగభద్ర వంతెన మీదుగా.. కర్ణాటక రాష్ట్రంలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు కర్ణాటక కాంగ్రెస్ నేతలు. దేశంలో సామరస్యం, ఐక్యత, సమగ్రత, ధరల పెంపుపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం రాయచూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. కేరళ, కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర సాగించిన రాహుల్ తుంగభద్ర నదీమ తల్లి చెంతకు ఉదయం చేరుకున్నారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో జయప్రదమై, కన్నడగడ్డలోకి తిరిగి అడుగుపెడుతున్న జోడో యాత్రకు నీరాజనాలు పట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నారు.
రాయచూరు తాలూకాలో జోడో యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. రెండున్నర రోజుల పాదయాత్రలో లక్ష మంది పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పొరుగు జిల్లాలు యాదగిరి. కలబురగి, బీదర్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. ఏఐసీసీ నూతన అధ్యక్షుడు ఖర్గే ఈ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆయన్ను పాదయాత్రలో పాల్గొనేలా చేసేందుకు రాష్ట్ర అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఆమె ఇక్కడికి రావడం సందేహమే.