చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చేనేత కార్మికులంతా కూడా ప్రధానికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధాని.. మోదీ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. నారాయణపేటలో చేనేత పార్కు పెడతామని అమిత్ షా ఆరేళ్ల క్రితం చెప్పారని.. ఇప్పటి వరకు అతీగతి లేదని మండిపడ్డారు. బీజేపీ నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు.
చేనేతకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. నేతన్నల చేయూత కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కొత్త పథకాలు అమలు చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఆ సంక్షేమ పథకాలను ఎత్తి వేశారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయని విధంగా చేనేతపై ఐదు శాతం జీఎస్టీ విధించారని విమర్శించారు. అవసరమైతే చేనేత రుణమాఫీకి మరోసారి ఆలోచిస్తామని ప్రకటించారు.