ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఉద్యమంలోకి రావాలని ఉందని..తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కొద్ది రోజుల క్రితమే ధర్మాన అన్నారు. విశాఖ గర్జన తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి ధర్మాన ఇప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు.
అందులో భాగంగానే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను అందించారు. తన రాజీనామాను అనుమతించాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల మేరకు తాను ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని భావిస్తున్నానని లేఖలో వివరించారు ధర్మాన. ఇందు కోసం రాష్ట్ర మంత్రిగా తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు.
ధర్మానను వారించిన సీఎం జగన్.. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచుతూ వికేంద్రీకరణ చేయటమే ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టం చేసారు. కచ్చితంగా మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి పదవికి రాజీనామా అవసరం లేదని వారించారు.