ఏపీ, తెలంగాణలలో త్వరలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు..? కేంద్ర ప్రభుత్వం కసరత్తు..?

-

సమైక్యాంధ్ర రాష్ట్రం విడిపోయి తెలంగాణ, ఏపీలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ప్రధాని మోడీ దగ్గరికి సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అనేకసార్లు వెళ్లి అసెంబ్లీ సీట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ మోడీ అప్పట్లో ఈ విషయంపై పెద్దగా ఆలోచించలేదు. అయితే తాజాగా మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచే దిశగా ప్రణాళికలు రచిస్తోందని తెలిసింది.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం పరిస్థితి ప్రస్తుతం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ సెఫాలజిస్ట్ ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ కింద పిటిషన్ దాఖలు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే దానికి సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ లోనే తెలంగాణ, ఏపీలలో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి అప్పటి కేంద్ర హోం శాఖ కేబినెట్ నోట్ తయారు చేసి తమకు పంపిందని ఈసీ ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాధానంలో తెలిపింది. దీన్ని బట్టి చూస్తే గత సార్వత్రిక ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలుస్తోంది. కానీ ఎన్నికలు వచ్చినందున అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇక తాజాగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. దీంతో అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే అసెంబ్లీ సీట్లను పెంచాలని అనుకుంటే ముందుగా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. కానీ 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు. అది పూర్తయితేనే పెంచాల్సిన అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎంత అనే విషయంపై స్పష్టత వస్తుంది. అయితే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ సీట్లను పెంచదలిస్తే ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. దీంతో ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 175 ఉండగా అది 225కు చేరుకుంటుంది. తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. మరి మోడీ ప్రభుత్వం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుందా లేదా అనే విషయం తేలాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news