హైదరాబాద్ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే బస్సు ఛార్జీలకంటే మెట్రో ఛార్జీలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న సామాన్యులకు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది మెట్రో సంస్థ. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ ఛైర్మన్‌గా కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సభ్యులుగా కమిటీని నియమించింది.
ప్రస్తుత ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపాలని కమిటీ ఛైర్మన్ ప్రయాణికులను కోరారు. మెయిల్ ([email protected]), ద్వారా గానీ, తపాలా ద్వారా అయితే ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 చిరునామాకు పంపాల్సిందిగా కోరారు.
‘ఛార్జీలు ఎంత పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేయనుంది’ అని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.