ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హింసకు ప్రతి హింస ఎప్పుడూ సమాధానం కాదని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము శాంతికాములు కాబట్టి ఓపికగా ఉంటున్నామని అన్నారు. మునుగోడులో నిన్న జరిగిన దాడిలో గాయపడి నాగోల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కేటీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పరామర్శించారు.
ఉప ఎన్నిక వేళ మునుగోడు మండలం పలివెలలో ఈటల నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడ్డారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ దాడిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కుసుమ జగదీశ్ సహా 12 మంది నాయకులకు గాయాలయ్యాయని తెలిపారు. ఎన్నికల్లో సానుభూతి కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఎన్నికల ప్రచారానికి అమిత్ షా ముఖం చాటేశారని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.