ఇలా ఎన్నేళ్లు కాలం వెళ్లదీస్తారు.. తెలంగాణ సర్కార్​పై హైకోర్టు ఫైర్

-

భద్రాచలంతో పాటు మరో మూడు మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీలుగానే కొనసాగిస్తామని, ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతూనే ఎన్నేళ్ల కాలం వెళ్లదీస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. భద్రాచలంతో పాటు మరో మూడు పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చడాన్ని సవాలు చేస్తూ వీరయ్య అనే వ్యక్తి 2020లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలను మున్సిపాల్టీలుగా మార్చడానికి వీల్లేదని జీవో అమలును నిలిపివేస్తూ అప్పట్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు పిటిషన్‌లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

భద్రాచలంతో పాటు నాలుగు గ్రామాలను పంచాయతీలుగా కొనసాగిస్తామని ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసినా దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయకపోవడాన్ని ధర్మాసనం నిలదీసింది. ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని అన్నారు. పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అధికారికంగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 2005 నుంచి ప్రభుత్వ న్యాయవాదులు మారుతున్నారని, వాయిదాలు కోరుతూనే ఉన్నారని ఇంకా ఎన్నేళ్లు పడుతుందని నిలదీసింది. ఈ నెల 25 లోగా భద్రాచలం తో పాటు నాలుగు పంచాయతీలపై నిర్ణయం తీసుకోని పక్షంలో ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news