ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం నేడు కనిపించనుంది. కొన్ని నగరాల్లో అది సంపూర్ణంగా కనిపించనుంది. హైదరాబాద్ మహానగరంలో మాత్రం చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40కు ప్రారంభమై 7.26 గంటలకు ముగుస్తుంది. గంట 46 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని జి.పి.బిర్లా ఆర్కియలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్స్టిట్యూట్(జీపీబీఏఏఎస్ఆర్ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలన్నీ మూసివేశారు. భద్రాద్రి శ్రీరామ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మళ్లీ తిరిగి ఇవాళ రాత్రి 7.30 తర్వాత ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. రేపు ఉదయం సుప్రభాత సేవ నుంచి భక్తుల దర్శనాలకు అనుమతించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెల్లవారుజాము కైంకర్యాల తర్వాత మూసివేశారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ జరిపి.. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రేపు ఉదయం నుంచే భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు.