ఈడీ కస్టడీకి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు

-

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ కస్టడీకి ఇస్తూ దిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. వారం రోజులపాటు శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును ఈడీ అధికారుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు సమయంలో అవసరమైన వైద్య సాయం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.

ఇవాళ ఉదయం దిల్లీలో శరత్, వినయ్ లను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ ప్రత్యేక న్యాయస్థానం వారం పాటు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న అభిషేక్‌ బోయిన్‌పల్లిని ఇప్పటికే కటకటాల వెనక్కి నెట్టిన ఈడీ.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఈ ఇద్దరిని నేడు అరెస్టు చేసింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్‌ చంద్రారెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. శరత్‌ చంద్రారెడ్డి సహా మరో మద్యం వ్యాపారి వినయ్‌ బాబును అరెస్టు చేసినట్లు తెలిపింది.

శరత్‌, వినయ్‌బాబుకు రూ.కోట్ల మద్యం వ్యాపారం ఉందని ఈడీ అధికారులు తెలిపారు. శరత్‌ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉండటం సహా ఆ గ్రూపునకు చెందిన 12 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించారన్న అభియోగాలపై ఆయణ్ను అరెస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news