టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నాయకులు అడ్డంగా దొరికిపోయారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని విమర్శించారు. ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు తెలియదని బీజేపీ చెప్పింది. మరి, సంబంధం లేని కేసులో ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు? దర్యాప్తు ఆపాలని ఎందుకు కోరుతున్నారు? దీని వెనక ఉన్నది బీజేపీనే. అందుకే సిట్ విచారణ ఆపాలని కోరుతున్నారు’’ అని హరీశ్‌రావు ఆరోపించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసుకు సంబంధించి హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలంటూ ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సిట్ ఏర్పాటును నిలిపి వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలాడిన మఠాధిపతులు, స్వామిజీలు తమకు తెలియదని చెప్పిన బీజేపీ ఇప్పుడు కోర్టుల మెట్లు ఎందుకు ఎక్కుతోందని ప్రశ్నించారు.