మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు నారాయణను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన కూకట్పల్లి లోధా బెలేజాలోని కూతురు నివాసంలో ఉండటంతో అధికారులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఏపీ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ అవకతవకలపై అధికారుల్ని నారాయణను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో సీఐడీ విచారణకు హాజరుకాలేడని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు నారాయణను హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో ప్రశ్నించవచ్చని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయన కూతురు నివాసంలో నారాయణను ప్రశ్నించారు.