టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో వైసీపీ నేతలు శ్మశానాన్ని కబ్జా చేశారంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. 100కి పైగా శవాలను పూడ్చిన ఆ శ్మశానాన్ని వైసీపీ నేతలు దుక్కి దున్ని మినుము పంట సాగు చేస్తున్నారంటూ ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ కథనంపై చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసీపీ పిశాచాలు పడ్డాయని పేర్కొన్నారు చంద్రబాబు. వైసీపీ స్థానిక నేతలు సమాధులను తవ్వేసి శ్మశానాన్ని కబ్జా చేస్తే… అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు చంద్రబాబు. వ్యవస్థలు సమాధి అయిన చోట వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయని చంద్రబాబు వివరించారు.
ఈ వ్యవహారంలో కనీసం ఉన్నతాధికారులు అయినా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కబ్జాదారులపై చర్యలకు దిగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎవరు సీమ ద్రోహులు? జాకీ పరిశ్రమను తరిమేశారంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రశ్నించారు. ‘పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా.. లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా?’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.