అల్లూరి జిల్లా అల్లివరం గిరిజన గ్రామానికి విద్యుత్ నిలిపివేతపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. నిలిపివేసిన విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ తొలగించడమే కాకుండా.. రూ.12 వేలు బిల్లు కట్టాలనడం దుర్మార్గం అని మండిపడ్డారు. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు చంద్రబాబు. అల్లూరి జిల్లా పాడేరు మండలంలో అల్లివరం అనే గిరిజన గ్రామానికి నిలిపివేసిన విద్యుత్ సరఫరా పునరుద్దరించాలి. గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ తొలగించడమే కాకుండా…రూ.12000 బిల్లు కట్టాలి అనడం అసమంజసం. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నానన్నారు చంద్రబాబు.
ఏజెన్సీలోని ఆదివాసీ, గిరిజన తెగలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వాగ్ధానంతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని అడవిబిడ్డలు సంబరపడ్డారు. ఐదేళ్లుగా సర్కార్ అందిస్తున్న సబ్సిడీతోనే కరెంటు సౌకర్యం పొందారు. ఉన్నట్లుండి మన్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలియక తల పట్టుకున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే… వారిచ్చిన సమాధానం మరింత దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు చంద్రబాబు. ప్రభుత్వ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం అల్లివరం అంధకారంలో మగ్గుతోంది. ఐటీడీఎ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండ పైభాగాన ఈ గ్రామం ఉంది. ఇక్కడ 50 కుటుంబాలు నివసిస్తున్నాయి.