మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 151వ సినిమా సైరా. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం మధ్యాహ్నం సైరా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో అలా రిలీజ్ అయ్యిందో లేదో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటూ షేర్లు చేస్తున్నారు.
సైరా మేకింగ్ చూస్తుంటే ఫ్యీజులు ఎగిరిపోయేలా ఉన్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఇప్పటి వరకు సినిమాపై ఉన్న హైప్ కాస్త డబుల్ అయ్యింది. ఈ మేకింగ్ వీడియోలో ఉన్న విజువల్స్ సినిమాలో కీలకమైన సీన్లకు సంబంధించినవిగా ఉన్నాయి. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇక 1.47 నిమిషాల పాటు ఉన్న మేకింగ్ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సినిమాలో ఉన్న ప్రముఖ నటీనటులతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతి కీలక టెక్నీషియన్‌ను మేకింగ్ వీడియోలో చూపించారు. మేకింగ్ వీడియో చూస్తుంటే బాహుబలి రేంజ్‌లో విజువల్స్ ఉండబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను వరల్డ్ ఆఫ్ సైరాగా పేర్కొన్నారు.
అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, నిహారిక కనిపిస్తారు. అందరికంటే చివరిగా నిర్మాత రామ్‌చరణ్ స్టైలీష్‌గా నడుచుకుంటు వచ్చిన తర్వాత డైరెక్టర్ సురేందర్‌రెడ్డి షాట్ యాక్షన్ చెపుతాడు. ఇక చివర్లో సైరా రోల్ చేస్తోన్న చిరు యాక్షన్ షాట్లు చూపించారు. చివర్లో సినిమా టీజర్‌ను కూడా ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.