‘గడప గడపకు మన ప్రభుత్వం’ పై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌కు వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుంది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం. జనవరిలో ఆసరా మూడో దఫా చెల్లింపు జరగబోతున్నది. రూ.6500 కోట్లు ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్ ఉంటుంది. సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారు సమర్థులై ఉండాలి. వారికి తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ ఉండి తీరాలి. అయితే ఎక్కడా వలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదు. అలాగే వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి. జనవరి 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది.
పగలు ఆ కార్యక్రమం చేసి, సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. అలాగే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక్కడ కూడా వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనిసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే, మూడు, నాలుగు రోజుల టైమ్ తీసుకొండి. కానీ ప్రతి ఇంటికి వెళ్లండి. ఎక్కడా తొందరపడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ఒక ఊరు తీసుకుంటే కచ్చితంగా పూర్తి చేయండి. లేకపోతే మీరు తమ ఇంటికి రాలేదని, వారు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా, మీరు పోవడం మానకండి. ఎందుకంటే వారికి ఎంత మంచి చేశామన్నది మన దగ్గర రికార్డులు ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనస్సు మారొచ్చు. కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇల్లు సందర్శించండి. అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులనే గుర్తించండి. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్‌లోడ్ చేస్తే, వెంటనే ఆమోదించడం జరుగుతుంది.’ అని వెల్లడించారు.