HBD MEGASTAR Chiranjeevi : ఎప్ప‌టికీ మెగాస్టారే.. అభిమానులకు ఆచార్య‌.. ఇండ‌స్ట్రీకి గాడ్ ఫాద‌ర్‌

-

MEGASTAR CHIRANJEEVI మెగాస్టార్ చిరంజీవి.. అభిమాన ధ‌నుడు, అభిమానుల‌కు ఆచార్య‌… సినిమా ప‌రిశ్ర‌మ‌కు గాడ్ ఫాద‌ర్‌.. స‌రిలేరు నీకెవ్వ‌రూ! ఈ మాట చాలా తక్కువ మందికే వ‌ర్తిస్తుంది. నిజానికి ఈ మాట అనిపించుకు నేందుకు కూడా చాలా అర్హ‌తే ఉండాలి. ఇలాంటి అన్ని అర్హ‌త‌లూ ఉన్న నాయ‌కుడు, రాజ‌కీయ నేత మెగాస్టార్‌గా చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న కొద‌మ సింహం.. కొణిద‌ల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌..

Megastar Chiranjeevi Birthday wishes
Megastar Chiranjeevi Birthday wishes

అంద‌రూ పిలుచుకునే చిరంజీవి పుట్టిన రోజు.. ఈ సంద‌ర్భాంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా కూడా ఆయ‌న పుట్టిన రోజును త‌మ సొంత పుట్టిన రోజు మాదిరిగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.. ఈ నేప‌థ్యంలో చిరంజీవి విశేషాలు.. కొన్ని..!

Megastar Chirnajeevi Aacharya
Megastar Chirnajeevi Aacharya

1955, ఆగ‌స్టు 22న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌న్మించిన చిరంజీవి.. తాను ఎంచుకున్న మార్గంలో మెగాస్టార్ అయ్యేందుకు వేసిన అడుగుల అన‌న్య సామాన్యం. వ‌ట వృక్షం మాదిరిగా ఆయ‌న ఎదుగుతూనే.. ఎంతో మందికి అవ‌కాశం ఇప్పించారు. ఎంతో మందిని పైకి తీసుకు వ‌చ్చారు. తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దు బిడ్డ‌గా ఎదిగిన ఆయ‌న న‌ట జీవితం.. ఇంతింతై.. అన్న‌ట్టుగా ముందుకు సాగిందే త‌ప్ప‌.. ఏనాడూ .. బోసి పోలేదు. ఆ త‌రం ఈ త‌రం అనే మాట లేకుండా నాలుగు త‌రాలుగా ఆయ‌న న‌ట‌న‌ను ఆస్వాదించ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. హావ భావాలు ప‌లికించ‌డంలోను, ఆక‌ట్టుకునే రూపంలోనూ ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

నిజానికి న‌ట‌న‌పై జిజ్ఞాస‌తో చెన్నైలో కాలు పెట్టిన స‌మ‌యంలో ఆయ‌న‌కు వ‌చ్చిన పాత్ర‌లు తెలిస్తే.. ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోతారు. తాను హీరో కావాల‌ని అడుగు పెట్టిన ప‌రిశ్ర‌మంలో ఆయ‌న తొలుత వ‌చ్చిన పాత్రలు ప్ర‌తినాయ‌క పాత్రలు. వాటినికాద‌నుకుని హీరో పాత్ర‌లు వ‌చ్చే వ‌ర‌కు వేచిచూసే ప‌రిస్థితి ఆయ‌న‌కు అప్ప‌ట్లో లేదు. దీంతో అయిష్ట‌మే అయినా.. అవ‌స‌రాల కోసం ఇది క‌థ‌కాదు వంటి మూవీల్లో ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌ను వేయాల్సి వ‌చ్చింది. అలా త‌న‌ను తాను ఒక చ‌ట్రంలో బిగించుకోకుండా ముందుకు సాగిన త‌రుణంలో చంట‌బ్బాయ్ వంటి విభిన్న‌మైన పాత్ర‌లు కూడా చేయాల్సి రావ‌డం ఒక ప‌రీక్షే అయినా.. అవ‌న్నీత‌న‌లోని విభిన్న‌త‌ను ప‌ట్టి చూపాయ‌ని మురిసిపోవ‌డం చిరంజీవికే చెల్లింది.

Happy Birthday Chiranjeevi
Happy Birthday Chiranjeevi

ఇలా దాదాపు నాలుగు ద‌శాబ్దాల పాటు తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగాన్ని ఏలిన చిరంజీవి నేటికీ త‌న స్టెప్పులతో అద‌ర గొడుతున్నారు. 2007లో వ‌చ్చిన శంక‌ర్ దాదా జిందాబాద్ త‌ర్వాత ఆయ‌న తెలుగు తెర‌కు దూర‌మ‌య్యారు. అనంత‌రం ఆయ‌న రాజ‌కీయ వేదిక‌కు త‌న అరంగేట్రాన్ని మార్చుకున్నారు., 2008లో ప్ర‌జారాజ్యం పేరుతో పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించారు. 2009 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా అడుగులు వేసినా 18 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే గెలిపించుకున్నారు.

Happy Birthday Chiranjeevi
Happy Birthday Chiranjeevi

అయితే, ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాల్లో ఆయ‌న నిల‌దొక్కుకోలేక‌.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి సంపాయించుకున్నారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ఉన్నారు. అయితే, రాజ‌కీయాల‌కు త‌న‌కు అచ్చిరాలేద‌ని బాహాటంగానే ఒప్పుకొన్న ఆయ‌న వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి నేటి రాజ‌కీయాల్లో గొప్ప పేరు మాట అటుంచి వివాదాల‌ల్లోనే నాయ‌కులు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. కానీ, చిరంజీవి మాత్రం ఎక్క‌డావివాదాల‌కు తావివ్వ‌కుండా ముందుకు సాగారు.

Happy Birthday Chiranjeevi
Happy Birthday Chiranjeevi

ఇక‌, ఆ త‌ర్వాత 2017లో మ‌రోసారి ముఖానికి మేక‌ప్ వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఖైదీ నెంబ‌ర్ 150(త‌న 150 వ చిత్రం) తీశారు. ఇది సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. సైరా న‌ర‌సింహారెడ్డితో సైసై అనిపించారు మెగాస్టార్‌. మాస్ట‌ర్‌గా, అన్న‌య్య‌గా ప్రేక్ష‌కుల అభిమానధ‌నుడు చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య, గాడ్ ఫాద‌ర్ సినిమాల‌తో రాబోతున్నారు. మొత్తానికి అటు రాజ‌కీయాల్లోను, ఇటు చిత్ర‌సీమ‌లోన‌నూ త‌న‌కు తిరుగులేని విధంగా మెరిసిపోతున్నారు మెగాస్టార్‌. మ‌రిన్ని సంవ‌త్స‌రాలు ఆయ‌న న‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌కు ఆనందం పంచాల‌ని కోరుకుందాం!

 

 

Read more RELATED
Recommended to you

Latest news