ఓ పెద్ద హీరో సినిమా వస్తుందంటే ఆ సినిమా ఫై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. తొలి రెండు మూడు రోజులు టిక్కెట్ రేట్లు పెంచేస్తుంటారు. జనాల ఆసక్తిని, త్వరగా సినిమా చూడాలన్న ఆతృతను వారు క్యాష్ చేసుకుంటుంటారు. అందుకే రెండు, మూడు రోజులు టిక్కెట్ల రేట్లను భారీగా పెంచుతారు. ఇదే తంతు ప్రతి పెద్ద సినిమా విషయంలో జరిగేది. సాహో విషయంలోనూ ఇదే ప్లాన్ చేశారు.
ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో టిక్కెట్ల రేట్లను భారీగా పెంచేసుకుంటున్నారు. టికెట్ల ధరల్ని పెంచాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరటం.. అందుకు ఓకే చెప్పేస్తూ ఆర్డర్ పాస్ చేశారు. సాహో చిత్ర టికెట్ల ధరల్ని భారీగా పెంచేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా టికెట్ ధర రూ.300 వరకు పెంచటంపై ఫైర్ అయిన నట్టి సినిమాపై హైకోర్టును ఆశ్రయించారు.
సాహో చిత్ర నిర్మాతలు ప్రేక్షకుల వీక్ నెస్ క్యాష్ చేసుకుంటున్నారంటూ… వారి ప్రయత్నాల్ని అడ్డుకోవాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం తాజాగా సాహో చిత్ర నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి.. విశాఖ పోలీస్ కమిషనర్.. సాహో చిత్ర వైజాగ్ పంపిణీ దారు దిల్ రాజుకు నోటీసులు జారీ చేశారు.
ఇది కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచ వద్దని ,పాత రేట్లకు టికెట్స్ విక్రయించాలని చెప్పడం తో నిర్మాతలకు అక్కడ షాక్ తప్పలేదు. ఇక తెలంగాణలో సాహోకు ప్రీమియర్లు కూడా లేవని తెలుస్తోంది. ఏదేమైనా భారీ ఓపెనింగ్స్‌పై కన్నేసిన సాహో మేకర్స్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బే.